తల్లి పొత్తిళ్లలో ఒదిగిపోవాల్సిన పసికందుకు పుడమి తల్లి పాన్పుగా నిలిచింది. బొడ్డు ఊడని మగ శిశువుపై మట్టి కప్పినప్పటికీ మృత్యుంజయుడిగా నిలిచాడు. అమ్మ ఆలన మధ్య.. ఆమె వెచ్చని ఒడిలో సేదదీరాల్సిన పసికందు కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే మట్టి మధ్య కనిపించాడు. కర్కశ హృదయుల దాష్టీకానికి సజీవసాక్ష్యంగా నిలిచాడు. మండుటెండలో అతడి ఆకలికేకలే రక్షా కవచాలయ్యాయి. అరుపులను విన్న పశువుల కాపరులే దేవుళ్లు అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం కృష్ణవరం శివారులో శనివారం ఈ హృదయవిదారక సంఘటన జరిగింది. కృష్ణవరం శివారు చెరువు వద్ద పశువులను మేపుతున్న స్థానికులకు చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. వారు వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన పసికందుపై సగం వరకు మట్టి కప్పి ఉంది. వారు శిశువును బయటకు తీసి సమీపంలోని గన్నవరం గ్రామ మహిళలను తీసుకొచ్చారు. వారు ఆ బిడ్డకు సపర్యలు చేశారు. శిశువు కాళ్లు, చేతులు, వీపు భాగానికి మట్టిలోని రాళ్లు రాసుకుని రక్తం కారుతోంది. వైద్య సిబ్బంది సాయంతో వారు లక్ష్మీపురం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడినుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించినట్లు వైద్యాధికారిణి స్వప్నికారెడ్డి తెలిపారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి. సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేతతో..భక్తుల ఆందోళన