Telugu Desam Party protests: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా … తెలుగుదేశం పార్టీ ఆందోళన నిర్వహించింది. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించి రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయాలలో వినతిపత్రాలు ఇచ్చి వేడుకున్నారు. పలుచోట్ల మెడకు ఉరితాడు బిగించుకుని ఆందోళనలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా: అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో ఆఫీస్ వద్ద తెలుగుదేశం నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు బిగించుకొని ఆందోళన నిర్వహించారు. నష్టపోయిన రైతులను.. ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా: పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆధ్వర్యంలో రైతులు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకుందామంటే రైస్ మిల్లర్లు రైతుల నుంచి బస్తాకు రూ.100 నుంచి రూ.200 వరకు వసులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ ఆపకపోతే వరి రైతుకు ఊరేగతి అంటూ నినాధాలు చేశారు. మిల్లర్లకు రైతులు కట్టిన డబ్బుల వివరాలతో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కోనసీమ జిల్లా: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం నేతలు ధర్నా చేశారు. ఎకరానికి 25 వేల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. రైతులను దుర్భాషలాడిన మంత్రి కారుమూరి క్షమాపణ చెప్పాలని నినదించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ప్రతి ధాన్యం గింజ కొనాలంటూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా: ఉండ్రాజవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన టీడీపీ నేతలు, రైతుల ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. పంట మునిగిన వారికి తక్షణమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిపోయిన.. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సంచులు వెంటనే ఇవ్వాలని కోరుతూ నినాదాలు చేశారు. ధర్నా అనంతరం మండల తహసీల్దార్ కనక రాజుకు వినతి పత్రం సమర్పించారు.
అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులు నష్టపోయిన వివిధ రకాల పంట ఉత్పత్తులను తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ఇవీ చదవండి: