తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో పచ్చని వ్యవసాయ క్షేత్రాల మధ్య మరో దివ్యక్షేత్రం అలరారుతోంది. ఏనుగుల మహల్‌లో కొలువైన ఆ పుణ్యక్షేత్రమే శ్రీచక్ర మహా మేరు యంత్రాలయం. రాష్ట్రంలోని ఏకైక మేరు శ్రీచక్ర ఆలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో లలితా మహా త్రిపురసుందరీ దేవి కొలువై ఉన్నారు. 1983లో ఈ ఆలయాన్ని పద్మశ్రీ ప్రణవానంద స్వామి ప్రతిష్టించారు. శ్రీచక్ర లఘుపూజా విధానం, నవావరణ పూజా విధానం, శ్రీచక్రంపై 400 పేజీల సమగ్ర గ్రంథం రచించి అందించారు శ్రీప్రణవానంద స్వామి. ఈ ప్రాంతానికి శ్రీనగరంగా నామకరణం చేశారు.
64 ఉపచారాలు
సాధారణంగా ఆలయాల్లో, 16 ఉపచారాలు చేస్తారు. శ్రీచక్ర మహామేరు యంత్రాలయంలో అమ్మవారికి 64 ఉపచారాలు నిర్వహించడం ప్రత్యేకత. అమ్మవారు శ్రీచక్ర స్వరూపిణి యంత్ర స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున ఆలయంలో నవావరణార్చన చేస్తారు. శ్రీచక్ర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో నిత్యం నవావరణ అర్చన, పంచామృతాల అభిషేకం, పుష్పాలతో విశేషాలంకరణ, లలిత సహస్రనామ కుంకుమార్చన, నిత్యం భాగవత పారాయణం చేస్తారు.
శ్రీచక్ర మేరు మహాయంత్రాన్ని దర్శించుకుంటే గ్రహ, రుణ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 27 నక్షత్రాల దోష నివారణకు పూజలు నిర్వహిస్తుంటారు. పెళ్లి కాని యువతీ యువకులకు వివాహాలు జరుగుతాయని విశ్వసిస్తారు. సామాన్యులకు శ్రీచక్రం అందుబాటులో ఉంచాలని శ్రీ ప్రణవానంద స్వామి ప్రతిష్టించిన ఈ ఆలయం భక్తుల నీరాజనాలు అందుకుంటోంది.
ఇదీ చదవండి: