రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రత్యామ్నాయ శక్తులను కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శనివారం ఆయన ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నాక భాజపా నాయకులతో కలిసి మరోసారి చర్చించారు. అనంతరం సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ పెద్దల సూచన మేరకు తాను ముద్రగడను కలిశానని తెలిపారు. రాష్ట్రంలో భాజపా, జనసేన కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ముద్రగడ పాత్రపై కొన్ని అంశాలను చర్చించామని, ఆయన ముందు పెద్ద లక్ష్యాన్ని ఉంచామని చెప్పారు. ముద్రగడ ఆలోచించుకుని సానుకూలంగా స్పందిస్తారనే ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భాజపా, జనసేన కలయిక ఒక కులానికో, వర్గానికో సంబంధించినది కాదని వివరించారు.
ఇదీ చదవండి: