Rains in Andhra Pradesh: గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో.. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అప్పనారామునిలంక, సఖినేటిపల్లి లంక, కొత్త లంకతోపాటు.. రామరాజులంక, బాడవ గ్రామాలను.. వరద చుట్టు ముట్టింది. అప్పనారాముని లంక కాజ్ వే, కొత్తలంక కాజ్ వేల పై నుంచి.. భారీగా వరద ప్రవాహం వల్ల సమీపంలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల పరిధిలో ప్రవహించే గౌతమీ గోదావరి నదీ పాయలు పోటెత్తాయి. దీని ప్రభావంతో ముమ్మిడివరం మండలం పరిధిలోని లంక ఆఫ్ ఠానే లంక, పల్లంవారిపాలెం గ్రామాల్లో మెట్ట పంటలు మునిగిపోయాయి. మునగ, అరటి తోటలు..నీటిలో మగ్గుతున్నాయి. ఐ.పోలవరం మండలం ఎదురులంక వద్ద కొబ్బరితోటలు కోతకు గురవుతున్నాయి.
ధవళేశ్వరం నుంచి వరద నీటిని వదలడం వల్ల బ్యారేజీకి దిగువనున్న కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. గౌతమి, వశిష్ట గోదావరి పాయల జోరు కారణంగా.. లంక గ్రామాలను.. వరద చుట్టుముట్టింది. అయినవిల్లి మండలం వెదురుబీడుము వద్ద కాజ్‌వే మునిగిపోయింది. లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. చాకలిపాలెం సమీపంలోని కనకాయలంక, బూరుగులంక, అరిగెల వారి పేట, ఉడుముడిలంక, జి పెదపూడిలంక, అయోధ్యలంక, ఆనగారిలంక పెదమల్లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాలను గోదావరి వరద ముంచెత్తింది. గోదావరి వరద గంటకు పెరుగుతుంది. ఏలేరుపాడు మండలం... రేపాక కొమ్ము, రుద్రంకోట, కోయిదా గ్రామాలు నీట మునిగాయి. వందలాది ఇళ్లు నీట మునిగడంతో.. గ్రామాలన్నీ గోదావరిని తలపిస్తున్నాయి. ఏలేరుపాడు మండల కేంద్రం నుంచి గోదావరి వరకు ఐదు కిలోమీటర్ల మేర వరద నీరు పోటెత్తింది. ముంపు గ్రామాల ప్రజలు పడవలపై సామగ్రిని తరలిస్తూ..... మైదాన ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో... కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మారేడుమిల్లి మండలంలో ప్రధాన రహదారులపై నుంచి వాగులు పరుగులు పెడుతున్నాయి. బోతులూరు-పుల్లంగి మార్గంలో కొండవాగు ఉద్ధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయి.... గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. మన్యంలో కురుస్తున్న వర్షాలతో ముసురుమిల్లి, భూపతిపాలెం జలాశయాలు నిండుకుండలా మారాయి. చింతూరు-భద్రాచలం రహదారిలో ఉన్న శబరి వంతెనకు సమీపం నుంచి వరద ఉద్ధృతి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు రావడంతో..రాకపోకలు స్తంభించాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోటపల్లి జలాశయంలోకి.. భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి ఉద్ధృతి కొనసాగుతుండటంతో.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా 2గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. భారీ వరద కారణంగా జలాశయం ప్రధాన కాలువ గట్టు.. ప్రమాదకరంగా మారడంతో.. సమీపంలోని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇదీ చదవండి: