పర్యటక ప్రాంతాలను సరదాగా వీక్షించేందుకు స్నేహితులు చేసిన విహారయాత్ర.. విషాదయాత్రగా ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా(east godavari district) మారేడుమిల్లి పర్యాటక ప్రాంతమైన జలతరంగిణి వద్ద ఆదివారం తేనెటీగల దాడి(bees attack)కి గురై షేక్ అబ్దుల్ మాలిక్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామం నుంచి 12 మంది యువకులు ఆదివారం తెల్లవారుజామున మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలు వీక్షించేందుకు బయలుదేరారు. అంతా సరదాగా గడిపారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో సమీపంలో టాయిలెట్‌కు వెళ్లగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో అబ్దుల్ మాలిక్‌తో పాటు అతని స్నేహితులు పరుగులు తీశారు. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో అబ్దుల్ మాలిక్ కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు కారులో ఎక్కించుకొని మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యలో అబ్దుల్ మాలిక్ మృతి చెందాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రిలోనే ఉంచారు. మృతుడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అబ్దుల్ ఖాన్ మృతి చెందడంతో తోటి స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి