తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లోని రహదారుల అభివృద్ధికి టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదారులు స్పందించటం లేదని ఆర్ అండ్ బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేంద్ర తెలిపారు. రాజవరం - పొదలాడ రహదారిని జీ.పెదపూడి నుంచి పి.గన్నవరం వరకు అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది జనవరిలో రూ.24.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ రహదారి బాగా దెబ్బతింది. ఇప్పటికీ మూడు సార్లు టెండర్లు పిలిచినా... కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని రాజేంద్ర అన్నారు.
అలాగే... బొబ్బర్లంక రహదారి అభివృద్ధికి రూ.16 కోట్లు, పి. గన్నవరం నుంచి కే.ముంజవరం రహదారి నిర్మాణానికి రూ.1.20 కోట్లు, ముంగండ నుంచి ముంజవరం రోడ్డు పనులకు రూ.1.50 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. వీటి కోసం ఇదివరకొకసారి టెండర్లు ఆహ్వానించినా.. గుత్తేదారులు స్పందించలేదు. ఓ వైపు వర్షాకాలం మొదలైంది. అసలే అధ్వానంగా ఉన్న రహదారులు మరింత దెబ్బతింటున్నాయి. టెండర్లు ఖరారు కాకపోవటంతో రహదారుల పనులు చేయలేకపోతున్నామని రాజేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి:
LIVE VIDEO: ఉప్పాడ తీరంలో బోటు బోల్తా.. రక్షించిన మత్స్యకారులు