తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లి, కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రేచర్లపేట ప్రాంతానికి చెందిన కుంచె నాని అనే మహిళ, ఆమె కుమారుడు ప్రభుతేజ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. వెంటనే స్పందించిన అవుట్‌పోస్టు పోలీసులు వారిపై నీళ్లు గుమ్మరించి రక్షించారు.
బాధితురాలి భర్త మరణించారు. ఆమెకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ‘మా ఇంటి పక్కనే ఉంటున్న వైకాపా నాయకుడు బి.రాజు... మమ్మల్ని ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయించి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం నాతోపాటు నా కుమారుడు, కుమార్తెలపైనా దాడికి పాల్పడ్డాడు. నా కుమారుడి తలపై పెద్ద గాయమవడంతో 12 కుట్లు వేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు దాడి చేసిన వ్యక్తికే వత్తాసు పలుకుతున్నారు. దీంతో న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చాం. కలెక్టర్ న్యాయం చేయాలి’ అని బాధితురాలు కోరారు. రెండో పట్టణ పోలీసులు అక్కడికి వచ్చి తల్లి, కుమారుడితో చర్చించగా.. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లబోమని స్పష్టం చేశారు. చివరికి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి, కుమారుడిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు