కాకినాడను ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజాప్రతినిధులంతా కలిసి పనిచేద్దామని ఎంపీ వంగా గీత కార్పొరేటర్లను కోరారు. పట్టణంలో జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డితో కలసి ఆమె హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా కాకినాడ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మేయర్ సుంకర పావని అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది. నగరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న వంతెనకు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పేరు పెట్టేందుకు సహకరించాలన్న ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రతిపాదనపై చర్చించారు. నగరం పురోగతిలో భాగస్వాములయిన వారిని గౌరవించుకోవాలన్న ఎమ్మెల్యే ఆలోచనకు సభ్యులు మద్దతు పలికారు.
స్మార్ట్ సిటీగా ముందడుగు..
కాకినాడ నగరం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆకర్షణీయ నగరం పథకంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండి : సోషల్ మీడియాతో సమయం వృథా: వెంకయ్య