కృష్ణాజిల్లా చల్లపల్లి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఇద్దరు టీచర్లు, ఐదుగురు విద్యార్థులకు వైరస్ నిర్ధరణ అయింది. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. తమ పిల్లలను తమ వెంట పంపించాలని ప్రధానోపాధ్యాయురాలిని కోరారు. అయినప్పటికీ ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా... తూర్పుగోదావరి జిల్లా గొల్లమామిడాడలోని కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని చూసేందుకు భక్తులు ఆలయానికి రావొద్దని కోరారు.
ప్రకాశం జిల్లాలో...
దర్శి నగర పంచాయతీలో కరోనా విస్తృతి రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. రోజూ 5 నుంచి 10 చొప్పున కేసులు పెరుగుతుండటంతో.. అధికారులు పట్టణాన్ని జోన్లుగా విభజించారు. తిరునాళ్లు, రాజకీయ సభలు, వివాహాలకు అనుమతులు ఇవ్వడంతో దర్శి ప్రాంతంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఇవీచదవండి.