రాష్ట్రంలో పలుప్రాంతాల్లో వాన కురుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షం కురవగా.. రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలోనూ తెల్లవారుజామున భారీ వర్షం పడింది. కాల్వలు నిండి ఎన్టీఆర్ సర్కిల్, నిర్మల కాన్వెంట్ వద్ద రహదారులపై వర్షపు నీరు ప్రవహించింది.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు ఉరుములు మెరుపులతో కూడిన కుండపోతగా వర్షం కురిసింది. రహదారి మీద వర్షం నీరు నిలిచిపోయింది. పక్వానికి వచ్చిన రబీ వరి చేలు పడిపోయాయి. వర్షం వల్ల పంటలకు నష్టం వచ్చే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వర్షాలు కొబ్బరి తోటలు ఇతర ఉద్యాన పంటలకు మేలు చేస్తాయని తెలిపారు. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు.. ఈ వానతో వాతావరణం చల్లబడి ఉపశమనం ఇచ్చింది.
అమలాపురం డివిజన్లో అకాల వర్షం డివిజన్ వ్యాప్తంగా గా 260.60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 16 మండలాల్లోనూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది 16 మండలాల్లోని ఆత్రేయపురం - 19.20, రావులపాలెం-12.40, కొత్తపేట-17.20, ఐ పోలవరం-2.20, ముమ్మిడివరం-5.20, అయినవిల్లి-11.40, పి గన్నవరం-42.40, అంబాజీపేట-18.40, మామిడికుదురు-37.00, రాజోలు-7.20, మలికిపురం-9.60, సఖినేటిపల్లి -6.20, అల్లవరం-34.00, అమలాపురం- 20.40,ఉప్పలగుప్తం - 11.40, కాట్రేనికోన-6.40 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది .డివిజన్ మొత్తం మీద పి గన్నవరం మండలంలో 42.40 మిల్లీ మీటర్లు అత్యధికంగా వర్షం పడింది. అతి తక్కువగా ఐ.పోలవరం మండలం లో 2.20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రైతులు ఎండబెట్టిన పసుపు, ఎండుమిర్చి వర్షానికి తడవకుండా పరదాలు కప్పారు. వేలాది ఎకరాల్లో మినుము పొలాల్లోనే ఉందని.. వరికుప్పలు తడిచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలులు లేకపోవడంతో మామిడి తోటలకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.
ఇదీ చూడండి. వడగళ్ల వానతో అన్నదాతకు ఇబ్బందులు