కాకినాడ 1వ డివిజన్ పరిధిలోని నాగమల్లి తోట జంక్షన్లోని గోశాలలో 300 పైగా ఆవులను సంరక్షిస్తున్నారు. అక్రమంగా కబేళాలకు తరలించే పశువుల్ని, వాటితోపాటు కాకినాడ రహదారులపై సంచరించే వాటిని పశుహింస నివారణ సంఘం (SPCA)లోకి తరలించి సంరక్షిస్తుంటారు. దాతలు ఇచ్చే గడ్డితోపాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వీటి సంరక్షణ జరగాలి. నగరపాలక సంస్థ పట్టించుకోకపోవడం వల్ల పశువులు సంచరించే ఆవరణ పూర్తి అపరిశుభ్రంగా మారింది.
కొద్దిపాటి వర్షానికే బురదమయం అవుతుంది. మేత మేయడానికి కూడా ఆవరణ అనుకూలంగా లేదు. బురద, రొచ్చుతో పరిసరాలు అపరిశుభ్రంగా తయరై..మూగ జీవాలు రోగాల బారిన పడుతున్నాయి. ఆహారం చాలక డొక్కలు ఎండిపోయి ఉసూరుమంటున్నాయి. బురద కారణంగా పశువులు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేకపోవడం, పగలు, రాత్రి తేడా లేకుండా నిలబడి జాగారం చేస్తున్నాయి. రోగాలుబారిన పడిన పశువులు గత వారం రోజులుగా నిత్యం చనిపోతూనే ఉన్నాయి, ఇప్పటివరకు పదికిపైగా మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.
చనిపోయిన వాటిని గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక భాజపా నాయకులు పశుహింస నివారణ సంఘం కేంద్రాన్ని సందర్శించి SPCA కేంద్రం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పశు సంరక్షణా కేంద్రంలో గతంలోనూ పదుల సంఖ్యలో జీవాలు ప్రాణాలు కోల్పోయాయని. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోవు రోజుల్లో ఆవుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటిని కాపాడాలని జంతు ప్రేమికులు వేడుకొంటున్నారు.
ఇదీ చదవండి: