Farmers Angry On YS Jagan Govt: రైతులు పండించిన ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేయడం లేదు. దీనిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఈ నెల 13న రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మరి కొన్ని జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. ధాన్యం నిల్వలున్నా కొనకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బ్యాంకు గ్యారంటీలు పూర్తి కావడంతో కొనుగోలుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు.
సీఎమ్‌ఆర్ ధాన్యం తీసుకోవడంలోనూ జాప్యం జరుగుతోంది. రంగు మారిన ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం చెప్పినా క్షేత్ర స్థాయిలో రైతులకు మొండి చేయి చూపిస్తున్నారు. అక్కడక్కడా కొన్నా బస్తాకు 4వందల రూపాయలు తగ్గించి ఇస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 16 నాటికి 26 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. ఖరీఫ్ లక్ష్యంతో పోలిస్తే ఇంకా 11 లక్షల టన్నుల వరకు తీసుకోవాలి . కానీ పలు జిల్లాల్లో ఇప్పటికే సేకరణ లక్ష్యం పూరైందని అధికారులు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందంటూ.. కొనుగోలు కేంద్రాలకు తాళాలేశారు. అధికారుల తీరుపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల ఆందోళనకు దిగినా ..ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు.
తూర్పుగోదావరి జిల్లాలో 2.66 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యం నిర్ణయించగా.. ఈ నెల 11 నాటికి 2.39 లక్షల టన్నులే కొనుగోలు చేశారు. కొన్ని మండలాల్లో ఈనెల 31 వరకు కొంటామని అధికారులు ప్రకటించారు. ఏలూరు, పెదపాడు మండలాల్లో ఖరీఫ్ పంటను జనవరి, ఫిబ్రవరి వరకు కోత కోస్తారు. పౌర సరఫరాలశాఖ మాత్రం నెలాఖరు వరకే ధాన్యాన్ని తీసుకొంటామంటోంది.
కొన్ని చోట్ల సేకరణ లక్ష్యం పూర్తైందని ట్రాక్ షీట్ రావడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 9.45 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేశారు. 4.31 లక్షల టన్నుల సేకరణకు నిర్ణయించగా..ఇప్పటికి 3 లక్షల టన్నులే కొనుగోలు చేశారు. ఇంకా 1.31 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అయినా కొనుగోలు చేయడం లేదు. సాంకేతిక సమస్యలున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీలు పూర్తి కావడంతో మిల్లులకు సరఫరా ఆపేశారు. కావాలనే సేకరణలో జాప్యం చేస్తున్నారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
కొన్ని జిల్లాలో ఖరీఫ్‌లో సన్న రకం వేయొద్దని ప్రభుత్వం చెప్పింది. దీంతో రైతులు ఆహార అవసరాల మేరకే వాటిని సాగు చేసి.. మిగిలిన విస్తీర్ణంలో ముతక రకం వేశారు. ప్రభుత్వం వాటినీ తీసుకోవడం లేదనే ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతోంది. విజయనగరం జిల్లాలో 2.64 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించగా.. ఆ లక్ష్యం పూర్తయింది. ఇంకా రైతుల దగ్గర 50 వేల టన్నులకు పైగా నిల్వలున్నాయి.
ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో రంగు మారిన ధాన్యాన్ని తీసుకోవడం లేదు. గోనె సంచులూ అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా జిల్లాలో 5.25 లక్షల టన్నులకు 3 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో 1.14 లక్షల టన్నులకు 65 వేల టన్నులే సేకరించారు. అధికారులు కుంటి సాకులు చెబుతూ ధాన్యం కొనగోళ్లను నిలిపివేయడంతో ...రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఇవీ చదవండి