తూర్పుగోదావరి జిల్లాలో వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. అయితే గ్రామాల్లో నీరు ఇంకా పోలేదు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని బడుగువానిలంకలో నిత్యావసరాలు దొరక్క నానా పాట్లు పడుతున్నారు. రెండోసారి వచ్చిన ముంపుతో సామాను సైతం వరదలో కొట్టుకుపోయాయని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలోని అనేక ఇళ్లు నీటిలో నానడం వల్ల పాడైపోయాయి. మరికొన్ని ఇళ్లు కూలిపోయాయి. తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క విష కీటకాలతో ఆందోళన చెందుతున్నామని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ముగజీవాల అరణ్య రోదన
వారి పరిస్థితి అలా ఉంటే.. మూగజీవాల రోదన మరోలా ఉంది. గ్రాసం లేక అవి అల్లాడిపోతున్నాయి. పశువుల కోసం వేసిన పంట నీటిలో నానడం.. ఎండుగడ్డి వరదలకు కొట్టుకుపోవటంతో జీవాలకు మేతలేక అల్లాడిపోతున్నాయి. దాణా కూడా దొరకడంలేదని వాపోతున్నారు. పశువులకు గ్రాసం, దాణా అందించి వాటి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
పాడైపోయిన పంటలు
గ్రామంలో అరటి, పూలతోటలు, కూరగాయలు, బొప్పాయి ఎక్కువగా పండిస్తారు. చాలా రోజులుగా పంటలన్నీ నీటిలో నానటంతో పనికిరాకుండా పోయాయని రైతులు అంటున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టామని.. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. పైపెచ్చు పాడయిన పంటలు తీసివేసేందుకు మరింత ఖర్చు అవుతుందని చెప్తున్నారు. జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని.. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..