మగ్గంపై బట్టలునేస్తూ... జీవనం సాగిస్తున్న నేత కార్మికులు ఇప్పుడు ఆకలితో సహజీవనం చేస్తున్నారు. ఇంటిల్లిపాది శ్రమిస్తేనే కడుపు నిండని పరిస్థితిలో ఆప్కో బకాయిలు మరింత కుంగదీస్తున్నాయి. 18నెలలుగా కొనుగోలు చేసిన వస్త్రాలకు సొమ్ము చెల్లించకపోగా... ఆరు నెలలుగా కొనుగోలునే ఆపేసింది. దీంతో నేత కుటుంబాల బతుకు బండి ఆగిపోయింది.
తూర్పుగోదావరి జిల్లాలో కె.గంగవరం, రామచంద్రపురం, కపిలేశ్వరపురం, మండపేట, కడియంలో చాలా కుటుంబాలకు వస్త్రాల తయారీనే జీవనాధారం. కె.గంగవరం మండలం అద్దంపల్లిలో సుమారు 300 కుటుంబాలకు కూడుపెట్టేది మగ్గమే. ఇక్కడ తయారయ్యే వస్త్రాలను శ్రీ మల్లేశ్వరీ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ద్వారా ఆప్కో కొనుగోలు చేసేది. విడతల వారీగా నగదు చెల్లించే ఆ సంస్థ.. గతేడాది మార్చి నుంచి చెల్లింపులు నిలిపేసింది. 6 నెలలుగా వస్త్రాల కొనుగోళ్లు ఆపేసింది.
హసనబాదలోని కార్మికులకే కోటీ ముప్పై లక్షల రూపాయలు ఆప్కో చెల్లించాల్సి ఉంది. ఇళ్ల వద్ద నిల్వ ఉన్న 70 లక్షల రూపాయలు విలువైన సరకు పాడై పోతుందని నేతన్న ఆవేదన చెందుతున్నాడు.సకాలంలో బకాయిలు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని నేత కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చూడండి