కరోనా బారిన పడి సరైన వైద్యం అందక, ఆక్సిజన్ లేక రాజమహేంద్రవరంలో సీనియర్ పాత్రికేయుడు సుంకర రామారావు మృతిచెందటం పట్ల... తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులు కరోనా బారినపడి చనిపోవడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో సుంకర రామారావు పడుతున్న బాధని చూసి స్థానిక పాత్రికేయులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మీడియా సిబ్బందిని కరోనా వారియర్స్ జాబితాలో చేర్చాలని చంద్రబాబు, లోకేశ్ డిమాండ్ చేశారు. వారికి కరోనా బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ ఆస్పత్రులలో సదుపాయాలను మెరుగు పరచాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు సమాచార శాఖ ద్వారా పీపీఈ కిట్లు అందజేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సహకారం అందించాలన్నారు. మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ప్రమాద బీమా పథకాల ఫైల్‌ను వెంటనే క్లియర్ చేసి పాత్రికేయులకు వైద్య, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలి'