Cakes And Sweets Ready For New Year : కొవిడ్ ఆంక్షల మధ్యే ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు అంతా సిద్ధమౌతున్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఇప్పటికే కేకులు, స్వీట్లతో..తియ్యని వేడుక చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వారి అభిరుచికి తగినట్లుగానే తయారీదారులు..నోరూరించేలా నయా రూపాల్లో కేకులను, స్వీట్లను సిద్ధం చేస్తున్నారు.
ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల కోసం... రంగుల రంగుల కేకులు సిద్ధమవుతున్నాయి. కేకుల తయారీల్లో దేశంలోనే సుప్రసిద్ధులైన అయ్యంగార్ లు దశాబ్దాల తరబడి దేశం నలుమూలల నివాసం ఏర్పరచుకుని కేకులను అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో.. అయ్యంగార్ లు తయారు చేసిన కేకులు ప్రసిద్ధి పొందాయి. చుట్టు పక్కల ప్రాంతాలవారు శుభకార్యాల కోసం ఇక్కడి నుంచి కేకులను తీసుకెళ్తుంటారు. ఇక ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెద్దఎత్తున కేకులు తయారు చేశారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా రకరకాల కేకులు తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. తణుకు పట్టణంలో సుమారు 40 ఏళ్లుగా కేకులు తయారు చేసి అమ్ముతున్నామని అయ్యంగార్లు అంటున్నారు.
ఇక రకరకాల స్వీట్లకు పెట్టింది పేరు తూర్పుగోదావరి జిల్లా. సమీపంలోని కేంద్రపాలిత యానంలో... బేకరీ ఉత్పత్తిదారులు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున స్వీట్లు, కేకులు తయారుచేసి సిద్ధంగా ఉంచారు. కేజీ నుంచి 25 కిలోల వరకు వివిధ రంగుల్లో తయారుచేసిన కేకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రజలకు కావాల్సిన వివిధ రుచుల్లో కేకులను అందుబాటులోకి తీసుకొచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు.
చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టి తీపి గుర్తులతో కొత్త సంవత్సరంలోకి నూతన ఉత్తేజంతో అడుగు పెట్టడానికి విజయనగరం ప్రజలు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో వేడుకలకు బేకరీలు, మిఠాయి, పూల దుకాణాలు ముస్తాబయ్యాయి. కరోనా కారణంగా గతేడాది నూతన సంవత్సర వేడుకలకు దూరమైన ప్రజలూ ప్రస్తుతం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. విభిన్న ఆకృతులతో తయారైన కేకులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నిరుత్సాహనికి గురైన వ్యాపారులు ప్రస్తుత కొనుగోళ్లు చూసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : Cake Show in Visakha : బొమ్మల్లాంటి కేకులు కావాలా ?? అయితే విశాఖకు వచ్చేయండి మరి...