ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని నమ్మకంగా ఉన్న వ్యక్తే ఆమె బంగారం కాజేయాలనే దురుద్దేశంతో హత్య చేశాడని.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీ లతామాధురి తెలిపారు. శుక్రవారం బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఫిబ్రవరి 4న రాజమహేంద్రవరం గ్రామీణంలోని హుకుంపేట పంచాయతీ ఆదర్శనగర్‌లో ఒంటరిగా ఉంటున్న జంగా నారాయణమ్మ(60) హత్యకు గురైంది. ఈ కేసులో ఈ నెల 25న అదే ప్రాంతానికి చెందిన చుక్కా లోవరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లోవరాజు విజయవాడకు చెందినవాడనీ... పదేళ్ల కిందట రాజమహేంద్రవరం వచ్చి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడని ఏఎస్పీ వివరించారు.. నారాయణమ్మ ఒంటరిగా ఉండడంతో ఆమెను బ్యాంకు, దేవాలయాలకు తీసుకెళ్తూ నమ్మకస్థుడిగా మారాడని తెలిపారు. వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం అతడి కంట పడడంతో ఓ పథకం ప్రకారం ఆమె నోరు నొక్కి ఊపిరి అందకుండా చేసి హతమార్చి ... ఇంట్లో ఉన్న 116 గ్రాముల బంగారు వస్తువులతో పరారయ్యాడని వివరించారు. నిందితుడిపై గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ పలు చోరీ కేసులు ఉన్నాయి. అతడి నుంచి మొత్తం 116 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: ద్విచక్ర వాహనంపై గంజాయి అక్రమ రవాణా.. ముగ్గురు అరెస్ట్