తూర్పుగోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖలో జన్మభూమి నిధుల అవకతవకలపై వైద్య, కుటుంబ సంక్షేమం అదనపు డైరెక్టర్ సావిత్రి విచారణ చేపట్టారు. కాకినాడ డీఎంహెచ్వో కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. సుమారు 50 లక్షల రూపాయల అవినీతి జరిగినట్లు సావిత్రి వెల్లడించారు. ఈ వ్యవహారంలో ముగ్గురి ప్రమేయముందని ప్రాథమికంగా తెలిసిట్టు చెప్పారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సావిత్రి తెలిపారు.
అసలేం జరిగింది..?
2015లో అప్పటి తెదేపా ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి రూ.50 లక్షలు విడుదల చేసింది. వైద్య శిబిరాలు, వాహనాలు, ఇతర ఖర్చులకు ఈ నిధులను వినియోగించాల్సి ఉండగా... వీటి ఖర్చుకు సంబంధించి మార్గదర్శకాలను అప్పట్లో విడుదల చేయక ఈ నిధులు పీడీ ఖాతాలోనే ఉండిపోయాయి. వీటిని స్వాహా చేసేందుకు కార్యాలయంలోని కొందరు అధికారులు వ్యూహం రచించి గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వారు విచారణ చేపడతున్నారు.