తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్ వాల్మీకి కొండ వద్ద టెంపో బోల్తా పడింది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా వాల్మీకి కొండ వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన వారు కర్ణాటక చిత్రదుర్గ జిల్లా చలకెరి గ్రామానికి చెందిన పర్యాటకులుగా తెలుస్తోంది. మృతులు కె.ఎస్.రమేశ్, అమృతవాణి, శ్రీనివాసులు, మధురాక్షమ్మ, గాయత్రమ్మ, శ్వేత, రామలక్ష్మిలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను ఎస్పీ నయీమ్ అస్మి, సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య పరామర్శించారు. గాయపడని వారిలో నలుగురు రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరొకరిని కాకినాడకు తరలించారు. మృతదేహాలను రంపచోడవరం నుంచి రాజమహేంద్రవరం తరలించారు. ఇక్కడ వీరి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రమాదంపై సీఎం ఆరా
తూర్పుగోదావరి జిల్లా టెంపో ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం... సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చిన కర్ణాటక యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు, పవన్ తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి :