YCP Leader Attack on MRPS Leaders in Chittoor: వర్షపునీటిని ఒడిసి పట్టేందుకు గత ప్రభుత్వాలు జలసంరక్షణ పనులు చేపట్టాయి. చెరువుల అభివృద్ధితో పాటు చెక్‌డ్యాంలు నిర్మించారు. ఒకప్పుడు లక్షలాది రూపాయల ప్రజాధనంతో సంరక్షణ కోసం నిర్మించిన ఓ చెరువుపా అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఏడాది క్రితమే బస్టాండు పేరుతో మట్టి వేసి చెరువును పూడ్చివేస్తుండగా.. అప్పటి రెవెన్యూ అధికారులు మేల్కొని అడ్డుకున్నారు. అప్పటి అధికారులు బదిలీ కావడంతో ప్రస్తుతం మళ్లీ అధికార పార్టీ నాయకులు అక్రమానికి తెర లేపారు.
బస్టాండు పేరుతో పట్టపగలు మట్టి, అంగళ్లు కూల్చివేసిన వ్యర్థాలతో కుప్పం మండలం మల్లానూరు చెరువును పూడ్చుతున్నారు. కుప్పం మండలం మొట్టకదిరిగానూరు గ్రామ రెవెన్యూ లెక్కదాఖలాలో సర్వే నెంబర్ 85-2లో 4.45 ఎకరాల విస్తీర్ణంలో మల్లానూరు రైల్వే స్టేషన్ వద్ద చెరువు విస్తరించి ఉంది. దీనికింద సుమారు 20 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం చెరువును అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పూడ్చుతున్నారు. వారిని అడ్డుకోలేక రైతన్నలు అయోమయంలో పడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు మేల్కొని చెరువును కాపాడాలని కోరుతున్నారు.
ఎమ్మార్పీఎస్ నాయకులపై దాడి: చెరువు పూడ్చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని పొన్నాంగూరు గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రకాశ్, అతని సోదరుడు సతీష్ ఆదివారం సాయంత్రం చెరువు వద్దకు వెళ్లారు. అక్రమాన్ని వీడియోలు తీసి అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కుప్పం మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ మురుగేష్‌తో పాటు అతని అనుచరులు తమపై దాడులు చేశారని బాధితులు తెలిపారు. సతీష్ తలకు గాయాలయ్యాయి. ఆగ్రహించిన బాధితులు చెరువు వద్దనే బైఠాయించి నిరసన తెలియజేశారు.వీరికి మద్దతుగా వెళ్లిన పలువురు టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ నేతలు బెదిరించారు. క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో మండల టీడీపీ నాయకులు పరామర్శించారు.
"చెరువులో మట్టి పూడ్చుతుంటే అడ్డుకున్నందుకు.. మురుగేష్, అతని పెద్ద కొడుకు, శ్రీను, ఇంకో ఇద్దరు మాపై దాడి చేశారు. ఈరోజు మేము మా సమస్య కోసం రాలేదు. ఊరు సమస్య కోసం వచ్చాం. న్యాయం జరిగే వరకు పోరాడుతాం"-బాధితులు, పొన్నాంగూరు
పూడ్చితే నాకేంటీ సంబంధం: అయితే చెరువు పూడికపై కుప్పం తహశీల్దారు పార్వతి స్పందించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే తాను చూస్తానని.. చెరువును పూడ్చితే తనకేంటి సంబంధం అన్నారు. అది ఇరిగేషన్ శాఖ పని అని.. ఆ ప్రాంతం నుంచి ఎవరో ఫోన్ చేస్తే.. ఈ విషయాన్ని ఏఈకి ఆమె చెప్పినట్లు తెలిపారు. అయినా అది చెరువో కాదో నేడు పరిశీలిస్తా అని ఆమె వివరించారు.