గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించుకున్న అనంతపురం జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమానును పోలిన మరో చిన్న తిమ్మమ్మ మర్రిమాను వరుస కరువులతో ఎండి పోతూ నేలరాలిపోతుంది. ఇది పెద్ద తిమ్మమ్మ మర్రి మానుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఆర్యన్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎద్దులవారి కోట సమీపంలో ఉన్న ఈ మర్రిమాను రెండు ఎకరాల విస్తీర్ణంలో 180 ఊడలతో విస్తరించి ఉంది. వర్షాలు బాగా కురిసి ఎప్పుడు ఏపుగా పెరుగుతుంది. ప్రస్తుతం పది సంవత్సరాలుగా నెలకొన్న వర్షాభావంతో భూమిలో తేమ అడుగంటిపోయి..ఎండిపోతూ నిరాదరణకు గురైంది.
ఈ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఆర్డీవో నందిరెడ్డి ఇక్కడ చిన్న తిమ్మమ్మ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట కూడా చేశారు. వంద సంవత్సరాల క్రితం ఎద్దులవారికోటకు చెందిన వృద్ధురాలు గిన్నిస్ బుక్ లోని తిమ్మమ్మ మర్రిమాను కాండాన్ని తెచ్చి ఇక్కడ పాతి పెట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో చుట్టు పక్కల గ్రామాల వారు ఈ చెట్టు కింద అనేక సమావేశాలు, గ్రామ సభలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకప్పుడు పర్యాటకుల సందడితో కలకలలాడే చిన్న తిమ్మమ్మ మర్రిమాను నేడు ఉనికిని కోల్పోతుంది. అటవీశాఖ, పర్యాటక శాఖ అధికారులు ఈ మహావృక్షం సంరక్షణకు, అభివృద్ధికి సహకరించాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు.
ఇవీ చదవండి...అక్కాతమ్ముడి 'చెప్పు' చేతల్లో విజయం