ఈటీవీ భారత్: కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా ఐఐటీ తిరుపతి ఏ విధంగా భాగస్వామ్యమైంది?
డా.శ్రీధర్ : ఐఐటీ తిరుపతిలో కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా చాలా కార్యక్రమాలను చేపడుతోంది. ప్రత్యేకించి కంప్యూటర్ సైన్స్ విభాగం తరపున... కొంత మంది విద్యార్థుల ఆలోచనలతో మేం ముందుకు నడిచాం. ఒక ఆన్ లైన్ గేమ్ ద్వారా ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించటం.... ఈ మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ప్రజలనాడి ఎలా ఉందనే విషయాన్ని తెలియచేసేలా మరో కార్యక్రమం..ఇలా రెండు కార్యక్రమాలకు ఐఐటీ తిరుపతిలో రూపకల్పన చేశాం.
ఈటీవీ భారత్: కోవిడ్ పై రూపొందించిన గేమ్ ప్రత్యేకతలేంటి?
డా.శ్రీధర్: కరోనా వైరస్ పై చాలా మంది మాస్కులు వేసుకోవాలి, గ్లౌజులు ధరించాలి, శానిటైజర్లు వాడాలి....భౌతిక దూరం పాటించాలని చెబుతూనే ఉన్నారు. ఇంతమంది చెబుతున్నా ఇప్పటికీ ప్రజల్లో ఉన్న అవగాహన చాలా తక్కువనే చెప్పాలి. అందుకే ఎడ్యుకేషనలో గేమ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. సర్వైవ్ కోవిడ్-19 పేరుతో ఒక గేమ్ కు రూపకల్పన చేశాం. ఆ గేమ్ లో ఉండే వ్యక్తి ప్రధాన బాధ్యత ఏంటంటే.....మాస్క్, శానిటైజర్ వాడితేనే వైరస్ నుంచి సర్వైవ్ కాగలుగుతాడు. లేదంటే వైరస్ బారిన పడి పవర్ ను కోల్పోతాడు. సరుకులు కొనేందుకు వెళ్లినప్పుడు, పండ్లు, కూరగాయలు కొనడానికి వెళ్లినప్పుడో.....ఈ మాస్క్, శానిటైజర్ తీసుకోవటం అనేది గేమ్ లో తప్పనిసరి. ఒకవేళ మాస్క్ లేనప్పుడు వైరస్ బారిన పడిన పక్షంలో గేమ్ లో ఉన్న హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే తనకున్న వైరస్ ను గేమ్ లో ఇతరులకు సంక్రమింపచేస్తాం లేదంటే.....మనకే పవర్ కోల్పోయి గేమ్ ఓవరై పోతుంది. ఈ విధంగా ఒక గేమ్ ను తీసుకురావటం ద్వారా చిన్నారుల నుంచి యువతరంవరకూ అందరినీ దృష్టిని ఆకర్షించేలా, అవగాహన కల్పించేలా ఈ సర్వైవ్ కోవిడ్-19 గేమ్ కు ఐఐటీ తిరుపతి కంప్యూటర్ సైన్స్ విభాగం రూపకల్పన చేసింది.
ఈటీవీ భారత్: కోవిడ్ పై రూపొందించిన ఈ గేమ్ ను అవగాహన కల్పించేలా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు..?
డా.శ్రీధర్: దీన్ని తిరుపతి ఐఐటీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచాం. ఆన్లైన్ లో ఆడుకోవచ్చు. లేదంటే లింక్ డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా మొబైల్ గేమ్ లా ఆడవచ్చు. ఈ గేమ్ ఆడిన తర్వాత... కరోనా నుంచి తప్పించుకోవటానికి మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పనిసరి అనే భావన బలంగా నాటుకుని.. తద్వారా ప్రజలందిరికీ కోవిడ్ పై అవగాహన కలిగేలా రూపకల్పన చేశాం.
ఈటీవీ భారత్: ఐఐటీ తిరుపతి తీసుకువచ్చిన మూడ్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ఏంటి?
డా.శ్రీధర్: మన దేశంలో ఇప్పటివరకూ కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకున్నాయి. ఉదాహరణకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నుంచి మొదటులపెట్టి తొలిదశ లాక్ డౌన్, రెండో దశ లాక్ డౌన్, మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధాన పర నిర్ణయాలు.. ఇలా అంశం ఏదైనా వాటిపై ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందో సమీకరించాలనే ఉద్దేశ్యంతో రూపొందించాం. ఐఐటీ తిరుపతిలోని రీసెర్చ్ ఇన్ ఇంటిలిజెంట్ సాఫ్ట్ వేర్ అండ్ హ్యూమన్ ఎనలిటిక్స్ - రీషా ల్యాబ్ లో ధీరజ్, అఖిల అనే విద్యార్థులు ఈ గేమింగ్, అండ్ మూడ్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ తయారీలో కృషి చేశారు. ఈ పోర్టల్ ద్వారా ఆయా రోజుల్లో ప్రజల మూడ్ ఎలా ఉందనేది తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోంది. ప్రజల అభిప్రాయాలను సంతోషం, వ్యతిరేకం, తటస్థం, బాధ ఇలా ఏడురకాల ఎమోషన్స్ ని బార్ లు, కర్వ్ లు గా రూపొందించాం.
ఈటీవీ భారత్: మూడ్ ఆఫ్ ఇండియా పోర్టల్ కోసం అభిప్రాయ సేకరణ ప్రక్రియ ఎలా జరుగుతోంది.?
డా.శ్రీధర్: ఇందుకోసం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది ప్రజలు తమ భావాలను వ్యక్త పరిచే ట్విట్టర్ ను ప్రామాణికంగా తీసుకున్నాం. ట్విట్టర్ లో ట్వీట్ చేసేప్పుడు చేసే హ్యాష్ ట్యాగ్ లను మా డేటాబేస్ కు కనెక్ట్ చేసుకోవటం ద్వారా...నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, మిషన్ లెర్నింగ్ ను ఉపయోగించి... దేశ వ్యాప్తంగా ప్రజలు ఆయా రోజుల్లో చేసే ట్వీట్ ల్లోని టెక్ట్స్ ను ఎనలైజ్ చేసే విధంగా రూపకల్పన చేశాం. తద్వారా ఆయా ప్రత్యేకమైన రోజుల్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందనే అంశంపై ఓ స్పష్టతకు రాగలుగుతున్నాం. మా ఈ ప్రత్యేకమైన పోర్టల్ ద్వారా గడచిన మూడునెలల ప్రజల అభిప్రాయాలకు సంబంధించిన డేటా బేస్ ను కలెక్ట్ చేయగలిగాం.
ఈటీవీ భారత్: మూడ్ ఆఫ్ ఇండియా పోర్టల్ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఏ విధంగా అందుబాటులో ఉంటుంది?
డా.శ్రీధర్: ఈ పోర్టల్ ద్వారా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయంపై ఓ అవగాహనకు రావచ్చు. కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వాలు ఈ బాధ్యతను నెరవేర్చలేవు కాబట్టి.....అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండే ఐఐటీలో ఈ ప్రయోగాన్ని చేశాం. దీని ద్వారా ప్రజలు ఏమనకుంటున్నారనీ ప్రభుత్వానికి.....ప్రభుత్వ నిర్ణయాలపై తమ అభిప్రాయం చెప్పే అవకాశం ప్రజలకు కలుగుతున్నట్లు అవుతోంది.
ఈటీవీ భారత్: సర్వైవ్ ఫ్రం కోవిడ్-19 గేమ్, మూడ్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఈ రెండింటి రూపకల్పనలో ఐఐటీ తిరుపతి భాగస్వామ్యం కావటం ఎలా అనిపిస్తోంది..?
డా.శ్రీధర్: తొలుత ఈ ఐడియాస్ మీద రీసెర్చ్ చేశాం. వాటిని పేపర్లకే పరిమితం కాకుండా రియల్ అప్లికేషన్ లా తీసుకురావాలని భావించాం. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటివి ఉపయోగపడతాయి కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. ఇటీవలే రాజస్థాన్ లో మా మూడ్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఆధారంగా ఓ సర్వే రూపొందించారు. ప్రభుత్వాలకు సంబంధించి మా రూపకల్పనలు ఉపయోగపడుతున్నాయంటే ఇలాంటి క్లిష్టసమయంలో ఓ జాతీయ స్థాయి విద్యాసంస్థకు ఇంకే కావాలి. ఈ రెండు ప్రాజెక్ట్ లు చాలా సంతృప్తినిచ్చాయి.
ఇదీ చూడండి: