తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందో తేల్చాలని.. ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇప్పటివరకు ఐఫ్ఐఆర్ నమోదు కాలేదు!
ప్రభుత్వం, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటు చేసుకుందని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టుకు తెలిపారు. ఘటనపై ఇప్పటివరకు ఐఫ్ఐఆర్ నమోదు కాలేదని.. ఎంతమంది చనిపోయారో ఇంతవరకు స్పష్టత లేదని వెల్లడించారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటనలో అసమానతలు
ఎక్స్‌గ్రేషియా ప్రకటనలో అసమానతలు పాటించారని కోర్టుకు వివరించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతులకు రూ. కోటి రూపాయలు ఇస్తే.. తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో మృతులకు రూ. 10 లక్షలు ప్రకటించారని అన్నారు. మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వం పరిహారం అందించాలని న్యాయస్థానాన్ని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు విచారణలో తేలిందని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఎవరి నిర్లక్ష్యమో తేల్చాలి..?
ఇరువురి వాదనలు విన్న ధర్నాసనం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. రుయా ఆసుపత్రి ఘటనలో ఆక్సిజన్ అందక చనిపోయారా? ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమా? ఏదో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందో తేల్చాలని.. ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి.