LOKESH PADAYATRA: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2023 జనవరి 27న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగే ఈ పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో 3రోజులు ఉండేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టనున్నారు. ఏడాదికి పైగా సాగే ఈ పాదయాత్రలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు చుట్టేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశంగా సాగనుంది. మహిళలు, రైతులు, వివిధ వర్గాల సమస్యలను చర్చించి పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేశ్ యాత్ర సాగనుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
అక్టోబరు నుంచే పాదయాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. వివిధ సాంకేతిక కారణాలు, క్షేత్రస్థాయి సన్నద్ధత అంశాలను పరిగణనలోకి తీసుకుని జనవరి 27న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకూ యాత్ర కొనసాగే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకూ సాగే ఈ పాదయాత్రలో వీలైనన్నీ ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు తిరిగేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
సరిగ్గా పదేళ్ల క్రితం 2022 అక్టోబర్ 2వ తేదీన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అది ప్రభావం చూపి.. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చింది. వివిధ అంశాలపై పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూరమైన వర్గాలను దరి చేర్చుకోవడానికి.. ప్రజా వ్యతిరేక పాలనను తూర్పారబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ఇంకా పెంచేందుకు లోకేశ్ యాత్ర సరైన సాధనమని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవీ చదవండి: