WATER PROBLEMS IN AP: వేసవి ప్రారంభమయ్యాక తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేయడం, ట్యాంకర్ల ముందు బిందెడు నీటి కోసం బారులు తీరడం చూస్తుంటాం. ట్యాంకర్లతో ప్రజలకు నీటిని సరఫరా చేసే వారే పెండింగ్ బిల్లుల కోసం రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేయడం రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా బయటకొచ్చిన వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే కావడం మరో విశేషం. ట్యాంకర్లతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రెండేళ్లుగా నీళ్లు సరఫరా చేసిన గుత్తేదారులకు దాదాపు 225 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
గ్రామాల్లో 200 కోట్లు, పట్టణాల్లో 25 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఒక సంవత్సరం ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసిన గుత్తేదారులు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో రెండో సంవత్సరం మళ్లీ ముందుకు రావడం లేదు. పెండింగ్ బిల్లుల కోసం కొందరైతే ఏకంగా హైకోర్టునే ఆశ్రయిస్తున్నారు. తాజాగా పెండింగ్ బిల్లుల కోసం చిత్తూరు జిల్లాలో కొందరు గుత్తేదారులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ నీటి సరఫరాను కొద్ది రోజులపాటు గుత్తేదారులు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
ప్రతి సంవత్సరం వేసవిలో గుంటూరు, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని అనేక గ్రామాల్లో ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తుంటారు. బోర్లు, నీటి పథకాలు ఉన్నా భూగర్భ జలాల కొరతతో అవి ఎండాకాలం మొదలైన 30-45 రోజులకే మొరాయిస్తున్నాయి. 2022లో 262 మండలాల్లోని 18 వందల55 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేశారు. ఈ సంవత్సరం కూడా 17 వందల 50 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలోని 65 పుర, నగరపాలక సంస్థల్లో సమ్మర్లో నిత్యం 533 ట్యాంకర్లతో ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తుంటారు. పైపు నీటి సదుపాయం లేని శివారు ప్రాంతాలకు ఈ పద్ధతిలో నీళ్లు ఎక్కువగా అందిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద నగరపాలక సంస్థల్లో తప్పితే మిగలిన చోట్ల గుత్తేదారులే ట్యాంకర్లను పంపుతుంటారు. రెండేళ్లుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు లేఖలు రాశారు.
పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాలన్నీ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకి అనుసంధానించడంతో బిల్లుల చెల్లింపు తమ చేతుల్లో లేదని పుర కమిషనర్లు చేతులెత్తేస్తున్నారు. 2022లో పట్టణ స్థానిక సంస్థల్లో 35 కోట్ల రూపాయలతో ముందస్తు ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా కొన్ని నగరపాలక సంస్థల్లో సాధారణ నిధుల నుంచి బిల్లులు చెల్లించారు. సాధారణ నిధులు తగినన్ని లేని పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీల్లో 2022కు సంబంధించిన బిల్లుల్లో 20శాతం కూడా చెల్లించలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో గల 568 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి దాదాపు 500 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నీటి సరఫరా, పంపింగ్ బాధ్యత చూసే ప్రైవేట్ ఏజెన్సీలకు గత రెండు సంవత్సరాలకు రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. మరో 100 కోట్ల రూపాయల వరకు విద్యుత్తు ఛార్జీల బకాయిలు ఉన్నాయి. దీంతో అనేక చోట్ల పథకాల నిర్వహణ భారమై ప్రైవేట్ ఏజెన్సీలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో నిర్వాహకులు వైదొలగకుండా ఇంజినీర్లు బతిమాలుకుంటున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు నీటి పథకాల్లో పని చేస్తున్న కార్మికులకు సైతం జీతాలు చెల్లించలేని పరిస్థితి.
ఇవీ చదవండి: