తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల విధుల్లో గ్రామ వాలంటీర్లను నియమించొద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ ప్రకటించారు. అదే సమయంలో ఏ పార్టీకీ ఏజెంట్లుగానూ వారు వ్యవహరించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ఈనెల17న జరిగే ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు.
మొత్తం 17 లక్షల 11 వేల 195 మంది ఓటర్లు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉండగా.. అందులో 8 లక్షల 38 వేల 17 మంది పురుష, 8 లక్షల 71 వేల 962 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్లు దాటిన వయో వృద్ధులు, వికలాంగులకు ఈసారి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించాం. వీరికి పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటేసేందుకు కూడా రవాణా సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. కోవిడ్ దృష్ట్యా మొత్తం 2440 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 466 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలటరీ దళాలు విధుల్లో ఉంటాయి. పోలింగ్ తీరును పరిశీలించేందుకు 816 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించాం. - కె.విజయానంద్, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి
6672 బ్యాలెట్ యూనిట్లు
28 మంది అభ్యర్దులు పోటీలో ఉన్నారని.. ఇందుకోసం 6672 బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 10 వేల 796 మంది పోలింగ్ సిబ్బందిని, 13 వేల పోలీసు సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తియ్యినట్లు వివరించారు.
కోడ్ ఉల్లంఘనపై కేసులు
తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు 352 నమోదు చేసినట్టు సీఈఓ విజయానంద్ తెలిపారు. ఇందులో జనసేన పార్టీపైనా ఓ కేసు నమోదైందన్నారు. ఉప ఎన్నికల్లో ఘర్షణ పరిస్థితుల్ని నివారించేందుకు 144 సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
ప్రలోభాలపై నిఘా
మరోవైపు తిరుపతి ఉప ఎన్నిక కోసం 23 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి వచ్చాయని.. శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం 48 గంటల పాటు ఆయా ప్రాంతాల్లో ప్రలోభాలపై నిఘా పెడుతున్నట్టు తెలిపారు. తిరుపతి, నెల్లూరు, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మూడు కంట్రోల్ రూంల ద్వారా పోలింగ్‌పై పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని... సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నో యువర్ పోలింగ్ స్టేషన్..
తిరుపతి ఉపఎన్నికల్లో విద్వేషపూరితమైన ప్రకటనలపైనా ఎన్నికల సంఘం దృష్టి పెట్టిందని సీఈఓ వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న పరస్పర ప్రకటనతో పాటు పోలింగ్ రోజున వచ్చే ఫిర్యాదులపై కూడా దృష్టి పెడతామని వెల్లడించారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకునేందుకు నో యువర్ పోలింగ్ స్టేషన్ పేరిట యాప్ కూడా రూపొందించామని .. ఎపిక్ కార్డు నెంబరు ద్వారా పోలింగ్ కేంద్రానికి గూగుల్ నావిగేషన్ పొందవచ్చని వెల్లడించారు.
ఇదీ చూడండి:
కరోనా సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఒక్కరోజులో.. 5 వేలు దాటిన కొవిడ్ కేసులు