చిత్తూరు జిల్లాపై రెండో దశలో కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలి విడతలో 9 నెలలకు 88 వేల 617 కేసులు నమోదవగా... రెండో విడతలో 5 నెలల్లోనే లక్షా 10 వేల మందికి పైగా వైరస్ సోకింది. వారం రోజుల క్రితం వరకు ఆసుపత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాలు రోగులతో కిటకిటలాడాయి. ప్రాణవాయువు కోసం జనం తల్లడిల్లిపోయారు. పడకలు దొరక్క నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గింది. ఫలితంగా ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని అధికారులు అంటున్నారు.
కొవిడ్ రోగుల కోసం రుయాలో 1099 పడకలు అందుబాటులో ఉండగా... ప్రస్తుతం 753 మంది చికిత్స పొందుతున్నారు. స్విమ్స్ శ్రీపద్మావతి కొవిడ్ కేంద్రంలో 675 పడకలు ఉండగా.... 481 మందికి చికిత్స అందిస్తున్నారు. తితిదే వసతి గృహాలైన పద్మావతి, విష్ణు నివాసం, శ్రీనివాసంలోని కొవిడ్ కేర్ కేంద్రాలకు వచ్చే కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. విష్ణు నివాసంలో 1034 పడకలు ఉండగా 246 మంది, తిరుచానూరు శ్రీపద్మావతి నిలయంలో 1100 పడకలకు 750 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు.
లాక్‌డౌన్ పటిష్ట అమలు, నియోజకవర్గాల వారీగా కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలతో... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని అధికారులు అంటున్నారు. మహమ్మారి పట్ల ప్రజల్లో చైతన్యం పెరగడం కూడా కేసుల తగ్గుదలకు కారణమైందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: