నష్టాల బాటలో రైతన్నలు..
సహకార రంగంలోని పరిశ్రమలు మూతపడటం... ప్రైవేటు చక్కెర పరిశ్రమలు రైతులకు దన్నుగా నిలవకపోవడంతో చెరకు పంట పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్దేశించిన మద్దతు ధర అందక...ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యాలు పంట కొనుగోలులో పెట్టే అంక్షల నడుమ రైతుకు కష్టాలు తప్పడం లేదు.
పదకొండులో నాలుగు మాత్రమే..
రాష్ట్రంలో సహకారం రంగంలో పదకొండు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో రెండు, నెల్లూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున చక్కెర కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని సహకార పరిశ్రమల్లో విశాఖ జిల్లాలోని చోడవరం, ఏటికొప్పాక, తాండవ విజయనగరం జిల్లాలో ఓ పరిశ్రమ ఉత్పత్తిలో ఉండగా... మిగిలిన ఏడు ఖాయిలా పడ్డాయి. సహకార రంగంలో చక్కెర పరిశ్రమలు విజయవంతంగా నడిచే సమయంలో చెరకు పంట సాగుచేసే రైతులు ఆశించిన మేర లాభాలు గడించారు. సహకార పరిశ్రమలు మూతపడటంతో ప్రైవేటు పరిశ్రమలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక చిత్తూరు జిల్లాలోనే సహకార రంగంలోని రెండు చక్కెర కర్మాగారాలపైనే దాదాపు 20 వేల మంది ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అవి కాస్తా మూతపడటంతో గడచిన మూడేళ్లలో రైతులు, కార్మికులు పడని వెతలు అంటూ లేవు.
భారం లేకుండానే రుణ సాయం
సహకార రంగంలో చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు గతంలో ఏర్పాటైన రంగరాజన్ కమిటీ పలు సిఫారసులు చేసింది. కానీ అలాంటి సిఫార్సులేవీ రాష్ట్రంలో అమలు కాకపోడవంతో చక్కెర పరిశ్రమలు ఖాయిలా దిశగా సాగాయి. వాస్తవానికి కేంద్రం అందించే రుణాల సాయంతో మూతపడ్డ పరిశ్రమలను తిరిగి అందుబాటులోకి తీసుకురావొచ్చు.
- మొత్తం ఆధునీకరణ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని జాతీయ సహకార అభివృద్ది సంస్థ(ఎన్సీడీసీ) నుంచి రుణంగా పొందవచ్చు
- చెరకు పిప్పి ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రంలోని మినిష్టరీ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ (ఎమ్ఎన్ఈఎస్) నుంచి రాయితీతో కూడిన రుణం అందుబాటులో ఉంది.
- ప్లాంటు ఆధునీకరణకు చక్కెర అభివృద్ది నిధి(ఎస్డీఎఫ్)నుంచి కేవలం 4 శాతం వడ్డీకే రుణం పొందే వీలుంది.
- మొత్తం ప్లాంటు విస్తరణలో 70 శాతం వరకు ఎస్డీఎఫ్ నుంచి రుణం తీసుకోవచ్చు.
- రైతులు, కర్మాగార యాజమాన్యం, ప్రభుత్వం మొత్తం వ్యయంలో పది శాతం భరిస్తే 90 శాతం వరకు రుణాలుగా సమకూరుతాయి.
ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడకుండానే మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించే అవకాశం ఉంది.
సహకార రంగంలో ఏర్పాటైన చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించే లక్ష్యంతో ఏర్పాటైన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోంది. పరిశ్రమల పునరుద్దరణకు ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు సహకార పరిశ్రమలపై రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో మూతపడిన ఏడు సహకార పరిశ్రమల్లో తొలి విడతలో తిరుపతి, కడప పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ కష్టాలు తీరాలంటే.. కార్మికులకు ఉపాధి దొరకాలంటే తప్పనిసరిగా మూతపడ్డ సహకార రంగ చక్కెర పరిశ్రమలను అందుబాటులోకి తీసుకురావాలని రైతన్నలు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి : "కేబినెట్ నిర్ణయం తర్వాత రాజధానులపై స్పందిస్తాం"