RAINS IN AP DUE TO MANDOUS CYCLONE : ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుపాను మాండూస్ తుపానుగా బలహీనపడింది. ప్రస్తుతానికి తమిళనాడులోని మహాబలిపురానికి 90 కి.మీ., చెన్నైకి 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 14కి.మీ వేగంతో కదులుతుందనీ స్పష్టం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాములోపు మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండి అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి , రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాను గాలుల కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
తుపాన్ కదలికలు పర్యవేక్షిస్తున్న విపత్తుల నిర్వహణ సంస్థ: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుపాన్ కదలికలను పర్యవేక్షణ చేస్తుంది. జిల్లాల యంత్రాంగానికి పలు సూచనలు జారీ చేసింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమందికి సబ్‌స్క్రైబర్స్‌కి హెచ్చరిక సందేశాలు పంపింది. తుపాను తీరం దాటినప్పటికి రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.తుపాన్ కదలికలను స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ప్రభావం చూపే జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. సహాయ చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరు-2 మొత్తం 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని ప్రభుత్వం తెలిపింది.
తిరుమలలో భారీ వర్షం: మాండౌస్ తీవ్రతుపాన్ ప్రభావంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో తీర ప్రాంతాలకు NDRF బృందాలను తరలించారు. వెంకటగిరిలో ఉదయం నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. చలిగాలులకు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు వర్షంలో తడుస్తూనే ఇళ్లకు వెళ్లారు.
చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవు: మాండౌస్ తీవ్రతుపాను ప్రభావంతో చిత్తూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం తడకుప్పంలోని తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. తుపాను ప్రభావంతో రాత్రి నుంచి బి.ఎన్.కండ్రిగ, వరదయ్యపాలెం, తడ, సూళ్లూరుపేట, సత్యవేడులో బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా చిత్తూరు జిల్లా అధికారులు అప్రమత్తం కాగా.. జిల్లాలోని విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
నెల్లూరులో అప్రమత్తమైన అధికారులు: మాండౌస్ తుపాను దృష్ట్యా నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు వివరించారు. ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే జిల్లాకు ఎస్డీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చాయని.. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
బాపట్లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: తుపాను దృష్ట్యా బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెం.8712655881.
అన్నమయ్య జిల్లాలో భారీ వర్షం: మాండౌస్ తుపాను కారణంగా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇవీ చదవండి: