మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న 'ఛలో కలెక్టర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు టి.జనార్ధన్ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. గుజ్జు ఫ్యాక్టరీల యజమానులతో నిన్న సమావేశమైన కలెక్టర్.. తోతాపురి రకానికి రూ.11 తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని చెప్పారు. అందుకు అంగీకారం తెలిపిన యజమానులు 24గంటల్లోనే మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరు మార్కెట్ యార్డులో కిలో మామిడి రూ.6కు కొనుగోలు చేయటం దారుణమన్నారు.
కలెక్టర్ ఆదేశాలు, సూచనలు పాటించే వారు లేరని.. రాజకీయ అండదండలతో ఫ్యాక్టరీ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని జనార్ధన్ మండిపడ్డారు. కిలో మామిడి ధర రూ.20 ధర సాధించే వరకు పోరాటం కొనసాగించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ధర వల్ల రైతులకు ఎకరాకు రూ.30వేలు నష్టం వస్తుందని మామిడి ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బి.శ్రీనివాసులు అన్నారు. గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు మాత్రం కోట్ల లాభాలు గడిస్తూ రైతు నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుందన్నారు. 'ఛలో కలెక్టర్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.రామానాయుడు, రైతు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పెద్దాపురం ఎన్ఎస్పీ కాలువ వద్ద అక్రమ తవ్వకాలు!