తిరుమలలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్ బాలుడి కేసులో పురోగతి కనిపించింది. అన్నారావు సర్కిల్ వద్ద నిందితుడి స్పష్టమైన ముఖాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడిని ఒక వ్యక్తి తీసుకెళ్తున్నట్లు గతంలోనే గుర్తించిన పోలీసులు... సీసీ ఫుటేజ్ అస్పష్టంగా ఉండటంతో కేసు దర్యాప్తులో ఆలస్యమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబంలోని ఆరేళ్ల బాలుడు శివకుమార్ సాహు.... గత నెల 27న తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి తప్పిపోయాడు. కుటుంబం ఫిర్యాదుతో .. తిరుపతి అర్బన్ పోలీసులు బాలుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. నిన్న రాత్రి నిందితుడి ఊహా చిత్రం విడుదల చేశారు.
ఊహా చిత్రం ఆధారంగా నిందితుడి కదలికలను సీసీ టీవీ దృశ్యాల్లో చూశారు. నగరంలోని అన్నారావు సర్కిల్ సమీపంలో ఓ దుకాణం వద్ద కిడ్నాప్ చేసిన రోజే నిందితుడు ఒంటరిగా తిరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల కంటపడకుండా తప్పించుకునేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాలు సైతం సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలను విడుదల చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. బాలుడిని గుర్తించేందుకు అర్బన్ ఎస్పీ .. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు లేదా బాలుడి ఆచూకీ తెలిసిన వారు తిరుపతి పోలీస్ కమాండ్, కంట్రోల్ రూమ్ నెంబర్ 80999 99977 సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చూడండి: