చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు కేవలం ఎనిమిది శాతం ఓటర్లు మాత్రమే తమ హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఐదు మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీలను వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. చంద్రగిరి మండలంలోని చంద్రగిరి టూ, దానంపట్ల, తొండవాడ, భీమవరం, కొట్టాలలో ఒక జడ్పీటీసీ, ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు వృద్ధులు, వికలాంగులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు.
మండలంలోని బాలికోన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ ముందు జిల్లా వైకాపా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫరూక్ గందరగోళం సృష్టించాడు. స్కూటర్‌పై వచ్చి పార్టీ కరపత్రాలను పోలింగ్ బూత్ ముందు చల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వారితో దురుసుగా మాట్లాడుతూ.. విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో వాహనాన్ని, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన వైకాపా నేత పోలీసులతో గొడవ పడ్డారు.
ఇదీ చదవండి: పరిషత్ పోరు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం