రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవన్న పిల్‌పై వాదనలు ముగిశాయి. పర్యావరణ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల చేపడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీలో తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టు అంటూ ఏపీ జీవోలోనే పేర్కొందన్నారు. ప్రాజెక్టు విషయంలో నిపుణుల కమిటీని తప్పుదోవ పట్టించారని తెలిపారు. సామర్థ్యం రెట్టింపు చేసినందున పర్యావరణ అనుమతులు అవసరమని అన్నారు.
కృష్ణా నదీ జలాల్లో కేటాయింపులకు అనుగుణంగానే ప్రాజెక్టు చెపట్టామని ఏపీ తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పాత ప్రాజెక్టేనని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. పర్యావరణ అనుమతులు అవసరం లేదని గతంలో నివేదిక ఇచ్చిన నిపుణుల కమిటీ వెల్లడించింది. నిపుణుల కమిటీ నివేదికపై తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్ శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే రెండ్రోజుల్లో లిఖితపూర్వంగా అందించాలని ఎన్జీటీ వివరించింది.
ఇదీ చదవండి: