చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తెదేపా అధినేత చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ, సమాధుల వద్ద సినీనటుడు నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేశ్ క్రమశిక్షణకు మారుపేరని.. తెదేపా కేడర్ కు ఆదర్శంగా నిలిచారన్నారు.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని.. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదన్నారు. అలాంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైకాపా నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదని నారా రోహిత్ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటన..
తిరుపతిలోని జలదిగ్బంధంలో ఉన్న బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను సినీనటుడు నారా రోహిత్ ఇవాళ పర్యవేక్షించారు. ఎమ్మార్ పల్లిలోని దుర్గానగర్లో పర్యటించిన ఆయన ముంపు ప్రాంత ప్రజలకు పాలు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నగరవాసులకు ఉదయం పాలు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేస్తుండగా... మధ్యాహ్నం, రాత్రి ఆహార పానీయాలను అందిస్తున్నారు. సహాయం అందజేస్తున్న సభ్యులను ఆయన ప్రశంసించారు.
ఇదీ చదవండి: 'మెజారిటీ ఉందని... ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు'