చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో భూ కుంభకోణం జరిగిందని తెదేపా నేత నల్లారి కిశోర్ ఆరోపించారు. వివిధ గ్రామాల్లో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను వైకాపా నేతలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. సుమారు 4వందల కోట్ల రూపాయల విలువైన భూమి అన్యాక్రాంతమైందన్నారు. మంత్రి, ఎంపీల అండ చూసుకుని వైకాపా నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములకు లేఔట్లు వేసి అక్రమంగా అమ్మేస్తున్నారని విమర్శించారు.
ఊర్లు, సర్వే నెంబర్ల వివరాలతో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మీడియా ముందు ఫొటోలు బయటపెట్టారు. జిల్లాలో భూ అక్రమాలపై సర్వే నెంబర్లు సహా త్వరలోనే బయటపెడతామని అన్నారు. జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి భూముల్లో ప్లాట్లు కొని నష్టపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కొనుగోలు చేసిన భూములు చెల్లవని కోర్టులో వేస్తే ప్రజలు నష్టపోతారని అన్నారు. మదనపల్లె, ఇతర ప్రాంతాలకు కూడా భూకుంభకోణం విస్తరించిందని తెలిపారు. భూ కుంభకోణంపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదన్నారు. అక్రమాలకు సహకరించిన అధికారులకూ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నల్లారి కిశోర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: