అర్హులైన ప్రతి రైతుకు పంటల బీమా వర్తిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లోని రైతులు పరిమితమైన సంఖ్యలో బీమా ద్వారా లబ్ధి పొందేవారని వ్యాఖ్యానించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పాల్గొన్నారు.
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి ఆరు జిల్లాల రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా ద్వారా అధిక ప్రయోజనం చేకూరనుందని మంత్రి తెలిపారు. అన్నదాతలను ఆదుకునే లక్ష్యంతో రైతుభరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిముట్లు, రాయితీ ధరలపై విత్తనాలు, ఎరువులు రైతులకు అందజేస్తున్నట్లు వివరించారు.