‘రాష్ట్రంలో ఏ మంత్రికి ఇన్ని బాధలు లేవు. నాపైనే చాలా ఒత్తిడి ఉంది. ఎంత వినయంగా పోతున్నా గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు పెడుతున్నారు. గ్రామం నుంచి కొందరిని తరిమేయాలంటే ఎలా? ఇలా ఎక్కడైనా చట్టం ఉందా? మీరు వద్దంటే రాజకీయాల నుంచి తప్పుకొంటా. మీ ఇష్టం చెప్పండి’ అంటూ సొంత పార్టీ నేతలతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి వాపోయారు.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని కొన్ని గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించలేకపోవడంపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయమై... శనివారం కార్వేటినగరంలో కరోనా టీకా ప్రారంభ కార్యక్రమం అనంతరం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ... ‘నేను అందరిలాగా రాజకీయాలు చేయడం లేదు. పద్ధతులు అనుసరిస్తున్నా. గ్రామం నుంచి కొందరిని తరిమేయాలంటే ఎలా?’ అంటూ పరోక్షంగా ప్రతిపక్షాల వారిపై కక్షసాధింపు చర్యలు తీసుకోవాలంటూ తనపై వస్తున్న ఒత్తిళ్లను ప్రస్తావించారు. జల్లికట్టుపైనా తానేమీ చేయలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేశారు.‘ఎస్పీతో మాట్లాడా. ఇతర ప్రాంతాల్లోనూ అనుమతిచ్చారని తెలిపా. పక్కనే తమిళనాడులో నిర్వహిస్తున్నారంటూ గుర్తు చేశా. అయినా ఒప్పుకోలేదు. నేనేమి చేయగలను’ అంటూ వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభం.. మెుదటి టీకా ఆమెకే!