Mini Mahanadu program: అన్నమయ్య జిల్లా సోమల మండలం వెంగంవారిపల్లెకు చెందిన పాడి రైతులు సోమవారం కందూరు-వల్లిగట్ల రోడ్డుపై పాలు పారబోసి నిరసన తెలిపారు. శివశక్తి డెయిరీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందినది కావడం గమనార్హం. శ్రీజ పాల సేకరణ ఏజెంట్ మధు కథనం ప్రకారం.. ‘‘సోమల మండలం వల్లిగట్ల పంచాయతీ వెంగంవారిపల్లెకు చెందిన రైతులు ఫిబ్రవరి నుంచి శ్రీజ డెయిరీకి ఉదయం, సాయంత్రం కలిపి నిత్యం 200 లీటర్ల పాలు పోస్తున్నారు. కలికిరి మండలం ఎల్లంపల్లి నుంచి ఓ ఆటో వచ్చి, ఈ పాలను డెయిరీకి తీసుకెళ్తుంది. జులై 6న మదనపల్లెలో జరిగిన మినీ మహానాడుకు వెంగంవారిపల్లె వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో అదేనెల 16న పాల సేకరణ నిలిపేస్తామంటూ శ్రీజ డెయిరీ మేనేజర్ చెప్పగా, కొనసాగించాలని రైతులు కోరారు.
రెండు రోజుల కిందట శ్రీజ డెయిరీ ప్రతినిధులు నారాయణరెడ్డి, మనోజ్‌కుమార్ ఫోన్ చేసి.. ఆగస్టు 1 నుంచి ఆటోను నిలిపేస్తున్నామన్నారు. సోమవారం ఆటో రాకపోవడంతో శ్రీజ డెయిరీ మేనేజర్‌కు ఫోన్ చేశాను. ‘మాకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. శివశక్తి డెయిరీ మేనేజర్ ఫోన్ చేసి ఆటోను నిలిపేయాలని చెప్పారు. వారు ప్రభుత్వంలో ఉన్నారు. మేమేం చేయలేం. మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి’ అని చెప్పారు. 200 లీటర్ల పాలను మేమేం చేసుకోవాలని అడగ్గా.. ఏమీ చెప్పలేదు. ఫిబ్రవరిలో మా ఊరి నుంచి ఒక క్యాను పోయగా, ఇప్పుడు 40 కుటుంబాలు కలిపి నాలుగు క్యాన్ల పాలు పోస్తున్నాం. మాకు న్యాయం చేయకుంటే ఆవులు అమ్మేసి, ఊరు వదిలి వెళ్లాల్సిందే’’ అని మధు వాపోయారు.
ఇవీ చదవండి: