చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో జల్లికట్టు సంబరాలు ఈరోజు కోలాహలంగా జరిగాయి. దిగువ గెరిగదొనలో పాడి పశువులకు రైతులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ముందస్తుగా జరిపిన ప్రచారం వల్ల.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా గ్రామానికి రావడంతో సందడి మొదలైంది. స్థానిక పశువులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కోడె గిత్తలను, ఎద్దులను సుందరంగా అలంకరించి జన సమూహంలోకి విడతలవారీగా వదిలిపెట్టారు.
రంకెలు వేస్తూ జనసమూహం వైపు దూసుకొస్తున్న ఎద్దులను, ఆలమందను అదుపు చేయడానికి.. వాటికి కట్టిన పట్టెడలను సొంతం చేసుకోవడానికి యువత ప్రయత్నం చేశారు. వాటిని చేజిక్కించుకున్న యువకులు కేరింతలు కొట్టారు. సుమారు మూడు గంటల సేపు సాగిన ఈ జల్లికట్టు.. ఆద్యంతం కోలాహలంగా జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: