Illegal Mining in Chittoor District: చిత్తూరు జిల్లాలో పెద్దాయన మైనింగ్ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికారుల అండతో ప్రభుత్వానికి నయాపైసా చెల్లించకుండా.. అప్పనంగా సహజ సంపదను దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆ గనుల్లో తవ్వుకుని, కోట్లాది రూపాయలు రాయల్టీ చెల్లిస్తామని కొందరు ముందుకు వచ్చినా.. అధికారులు మాత్రం స్పందించడం లేదు.
గనుల తవ్వకాలకు అనుమతులు కోరి.. ఏళ్లు గడుస్తున్నా వారి దరఖాస్తు ముందుకు కదలడం లేదు. కానీ పెద్దాయనకు చెందిన సంస్థ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, ఎలాంటి అనుమతి లేకుండా అడ్డుగోలుగా తవ్వుకుంటున్నా.. అధికారులు ఎవ్వరూ అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతున్నా.. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.పుంగనూరు నుంచి మదనపల్లె వెళ్లే మార్గంలో.. పాలెంపల్లిలో 4.99 హెక్టార్లలో ఒకరు, 3 హెక్టార్లలో మరొకరు కలరర్ గ్రానైట్ తవ్వకునేందుకు 2018 లోనే లీజు దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో తహసీల్దార్ నిరభ్యంతర పత్రాన్నీ ఇచ్చారు. గనులశాఖ సహాయ సంచాలకుల కార్యాలయ సిబ్బంది సర్వే చేసి.. లీజుల మంజూరుకు సిఫారసు చేస్తూ విజయవాడలోని సంచాలకుల కార్యాలయానికి దస్త్రాలను పంపారు.
లీజు వస్తుందనే నమ్మకంతో ఈ స్థలం మీదుగా వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్లను కూడా దరఖాస్తుదారులు మార్పించుకున్నారు. ఇందుకోసం అయ్యే వ్యయ ప్రయాసలను భరించారు. అప్పటి నుంచి లీజు ఉత్తర్వుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా.. ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇదే ప్రాంతంలో పెద్దాయన సంస్థకు చెందిన కంకర క్రషర్ ఉంది. వారి కన్ను ఈ కలర్ గ్రానైట్ ప్రాంతంపై పడింది. అంతే.. ఎవరి అనుమతులు లేకుండా ఎడాపెడా తవ్వేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మూడు హెక్టార్లలో బ్లాస్టింగ్ చేసి గ్రానైట్‌ను తరలించేశారు. అందులో నుంచి పక్కనే ఉన్న క్రషర్‌కు ముడి రాయిని తీసుకెళ్లి కంకరగా మార్చేస్తూ, సమీపంలోని మూడు హెక్టార్లలో డంపు చేస్తూ వచ్చారు.
ఆ స్థలంలోనూ గ్రానైట్ లీజు కోసం తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ గతంలో దరఖాస్తు చేసుకుంది. కానీ దాన్నీ వీళ్లే వాడుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లో మొదలైన ఈ అక్రమాల పరంపర.. మూడున్నర ఏళ్లపాటు కొనసాగింది. సర్వే నెంబరు 593, 595లో దాదాపు 25 మీటర్ల లోతున తవ్వేశారు. ఈ ప్రాంతంలో గ్రానైట్ లీజు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకరు ఎన్నికల సమయంలో ‘పెద్దాయన’ వెనుక తిరిగేవారని, గత ఎన్నికల్లోనూ ఆయన విజయానికి కష్టపడ్డారని సమాచారం.
ఇవీ చదవండి: