గుడికో గోమాత కార్యక్రమంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని గత నెలలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో తిరుమల అన్నమయ్య భవనంలో హిందూ ధర్మప్రచార పరిషత్ సమావేశం నిర్వహించారు. గుడికో గోమాత కార్యక్రమం హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ గోసంరక్షణశాల ఆధ్వర్యంలో అమలు చేయాలని తీర్మానం చేశారు.
జిల్లాకు ఓ గోవు..
తెలంగాణలోని పాత 10 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో జిల్లాకు ఓ ఆలయం చొప్పున, కర్ణాటక రాష్ట్రంలోని 5 దేవాలయాల్లో కలిపి మొత్తం 28 ఆలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. తితిదే ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా దేశవాళీ ఆవుల దానాన్ని స్వీకరించాలని తీర్మానించారు. మఠాలు, పీఠాలు, వంశపారంపర్య పర్యవేక్షణ ఆలయాలు, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, వేద పాఠశాలలకు ఈ కార్యక్రమం ద్వారా గోవులను తితిదే అందజేస్తుంది.
ఎవరికి వారే పోషణ భారం చూడాలి : తితిదే
గోదానం పొందిన సంబంధిత ఆలయాలు, పీఠాలు, వేదపాఠశాలలు గోవుల పోషణ బాధ్యత చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు తితిదే ధర్మకర్తల సమావేశంలో నిర్ణయించారు. తితిదే దానం ద్వారా పొందిన గోవుల వద్ద గుడికో గోమాత - తితిదే అనే బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్వీ గో సంరక్షణశాల ముందస్తు అనుమతితోనే భక్తులు ఈ కార్యక్రమానికి గోవులను దానం చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు, గోదానం దరఖాస్తులను ఎస్వీ గో సంరక్షణశాల డైరెక్టర్ పర్యవేక్షిస్తారు.
ఇవీ చూడండి : తిరుమల బ్రహ్మోత్సవాలు : గజ వాహనంపై గోవిందుడి కటాక్షం