చిత్తూరు జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. వారి అవసరాలకు తగ్గట్లు విత్తనాలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ విజయ్ కుమార్ తెలిపారు. విత్తనాలు ఎలా తీసుకోవాలి.. నగదు ఎలా కట్టాలి తదితర వివరాలు ఆయన తెలియజేశారు.
* ప్రభుత్వం జిల్లాకు 75 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయించింది. జిల్లాలోనే 44 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించాం. మిగిలిన వాటిని ఏపీ సీడ్స్ ద్వారా తెస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలో 37 వేల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశాం. విత్తన కొరత లేదు.
* విత్తనాలు కావాల్సిన రైతులు గ్రామ సచివాలయంలో గ్రామ వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులను(వీఏఏ, వీహెచ్‌ఏ) సంప్రదించాలి. ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, చరవాణి నెంబరు అందజేయాలి.
* వారి వేలిముద్ర సేకరించి పేరు, ఎన్ని బస్తాలు తదితర వివరాలు నమోదు చేయగానే.. ఓటీపీ నెంబరు, ఎన్ని బస్తాలు, నగదు వివరాలు సంక్షిప్త సందేశం వారి చరవాణికి వస్తుంది.
* ఓటీపీ నెంబరును సచివాలయంలోని విలేజ్ డిజిటల్ అసిస్టెంట్(వీడీఏ)కు అందజేసి నగదు చెల్లించాలి. ఏరోజు విత్తనాలు తీసుకోవాలో తెలియజేసే రసీదును ఇస్తారు.
* 18 నుంచి 28 వరకు గ్రామ సచివాయాల వద్ద, 30 నుంచి రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాన్ని తీసుకెళ్లవచ్చు. రైతుకు గరిష్ఠంగా 3 బస్తాలు ఇస్తాం. అర ఎకరా విస్తీర్ణానికి ఒక బస్తా, ఎకరాకు 2 బస్తాలు, ఒకటిన్నర ఎకరా నుంచి ఆపై విస్తీర్ణం ఉంటే 3 బస్తాలు అందజేస్తామని' జేడీ విజయ్ కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి.. కోయంబేడు చిచ్చు..7 జిల్లాల్లో 31 కరోనా కేసులు