Govt delay in payment of rent of Anganwadi centers: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు అప్పుల పాలవుతున్నారు. భవనాల అద్దెలు, పిల్లలకు పౌష్టికాహార సరకుల బిల్లులే..ఒక్కొక్కరికి వేల రూపాయల బకాయిలు పడ్డాయి. తిరుపతిలో ఎనిమిది నెలలుగా అద్దె బిల్లులు రావాల్సి ఉండగా.. జిల్లాలోని మిగిలిన కేంద్రాల్లోనూ నాలుగు నెలలుగా చెల్లించలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 21 ప్రాజెక్ట్‌ల పరిధిలో 7 వేల 125 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 2 వేల 388 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. నగర, పట్టణాల్లో మూడున్నర వేల నుంచి నాలుగు వేలు.. గ్రామీణ ప్రాంతాల్లో 250 నుంచి వెయ్యి రూపాయల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఆహార పదార్థాల్లో ప్రభుత్వం ఇచ్చేవి పక్కనబెడితే తామే కొనాల్సినవాటి కోసం కాండిమెంట్స్ బిల్లులు మంజూరు కాలేదని చెబుతున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనలతో పాటు నెలవారీ జీతాలూ సమయానికి ఇస్తున్నప్పుడు తమ విషయంలో నిర్లక్ష్యం ఎందుకని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు ఆకలేస్తే తమవైపే కదా చూస్తారు అని గుర్తుచేస్తున్నారు. వయసుమీద పడ్డాక ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ఇంకో ఉద్యోగం వెతుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నామని నిర్వాహకులు అంటున్నారు. బకాయిల్ని మంజూరు చేయాలంటూ వేడుకొంటున్నారు.
చిత్తూరు జిల్లా ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు మార్చి నుంచి అద్దె బకాయిలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. మార్చి నెల బడ్జెట్ ఆలస్యం కావడంతో పాటు సీడీపీవోల నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడంతో అవాంతరాలు ఏర్పడ్డాయని తెలిపారు. తిరుపతి ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు పర్యవేక్షిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ రాస్ నుంచి సకాలంలో బిల్లులు సమర్పించకపోవడంతో అద్దె బకాయిలు ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: