చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ఈ అటవీ సమీప గ్రామాల్లోని పంటలను అడవి జంతువులు నాశనం చేస్తుంటాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా వరి, చెరుకు పండిస్తారు. పంటలను కాపాడుకునేందుకు రాత్రిపూట కాపలా కాయడం, బైండింగ్ వైర్ చుట్టడం, టపాసులు పేల్చడం చేస్తుంటారు. వీటితో మనుషులకు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కాశిపెంట్ల పంచాయతీ ధనమూర్తిపల్లెకు చెందిన రైతు దామోదర్ నాయుడు ఆలోచన అందరి రైతులకు వరంగా మారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు కేవలం మూడు వందల రూపాయల ఖర్చుతో పంటను రక్షించుకునేందుకు ఓ ఆలోచన చేశాడు. ఒక వెదురు బొంగు, పది అడుగుల దారం, టార్చ్ లైట్, థర్మకోల్ షీట్తో అడవి జంతువులకు దడ పుట్టిస్తున్నాడు.
వెదురు బొంగు చివరకు తాడును కట్టాడు రైతు దామోదర్. తాడు చివర థర్మకోల్ షీట్ కటింగ్.. ఈ రెండింటి మధ్యలో టార్చ్ లైట్ వేలాడే విధంగా అమర్చాడు. పంట చుట్టూ తెల్లటి గోనె సంచులను ఏర్పాటు చేశాడు. రాత్రిపూట లైట్ వేయడంతో గాలికి అటూ ఇటూ తిరుగుతూ టార్చ్ లైట్ పడుతుండడంతో అడవి జంతువులు పంట వైపు రావడం మానేశాయి. వెలుతురు ఉండటంతో .. జంతువులు భయపడుతున్నాయి. మిగతా రైతులు కూడా ఈ విధానాన్ని అవలంబించి తమ పంటలను కాపాడుకోవచ్చని దామోదర్ తెలిపాడు. చుట్టుపక్కల రైతులు అడవి పందుల బెడద తగ్గడంతో దామోదర్ నాయుడు చేసిన ప్రయత్నాన్ని పాటిస్తున్నారు. కేవలం మూడు వందల రూపాయలతో పంటను కాపాడుకోవడం సంతోషంగా ఉందని రైతులు అంటున్నారు.
ఇదీ చదవండి: పుట్టెడు కష్టం.. సహాయం కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబం