శ్రీకాళహస్తిలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం, అవసరమైన వస్తువులు ఆయా వీధుల్లోకి అందుబాటులోకి తీసుకురావడం, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలతో కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా, అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, ప్రత్యేకాధికారి సునీల్‌కుమార్‌రెడ్డి, కరోనా నియంత్రణ పట్టణ ప్రత్యేకాధికారి పృధ్వీతేజ్, పుర కమిషనర్ శ్రీకాంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి డాక్టర్ హనుమంతరావు ఇలా ఆయా శాఖల్లోని కీలక అధికారులు కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి సూచనలు ఇస్తూ పట్టణ ప్రజలకు సమస్యలు రానీయకుండా సమన్వయంతో సేవలందించారు. తత్ఫలితంగా ప్రజలు కూడా రోడ్లపైకి రాకుండా అధికారులకు సహకారం అందిస్తున్నారు.
అనవసరం.. అనర్థం
అనవసరంగా రోడ్లపైకి రావడంతోనే కరోనా విజృంభిస్తోందని జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా పట్టణ ప్రజలకు విన్నవించారు. నిత్యావసరాలన్నీ తాము ఇళ్ల వద్దకే తీసుకువస్తామని స్పష్టం చేశారు.పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ఎంతో శ్రమిస్తోంది. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు అనుమానితులను ఆస్పత్రులకు పంపి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రత్యేకించి కుప్పానికి చెందిన 20 మంది జూనియర్ డాక్టర్లు కరోనా కట్టడికి శ్రమిస్తున్నారు.
ఉల్లంఘనులపై కఠిన చర్యలు
అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు అధునాతన ఫాల్కాన్ యంత్రాన్ని తెప్పించారు. రెండ్రోజుల్లో వందలాది ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు అవగాహనకు వచ్చారు. సమన్వయంతో పనిచేసే అన్ని శాఖలకు తమవంతుగా సహకారం అందించాలన్న భావనతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్ ముగిసే వరకు అందరూ శ్రమిస్తేనే కరోనా వాప్తికి పూర్తిగా కళ్లెం పడుతుంది.
ఇవీ చూడండి...