ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలను వదిలేయటంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి అర్హతలేని వారితో ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎంపీడీఓ రాధమ్మపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ రోజు మండలంలోని కొన్ని పంచాయతీల్లో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా తరపున బరిలో నిలిచిన చంద్రగిరి ఎమ్మెల్యే కుమారుడు మోక్షిత్ రెడ్డితో పట్టాలు అందజేయటాన్ని తెదేపా నేతలు తప్పుపట్టారు.
ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నా పట్టించుకోకపోవటం దురదృష్టకరమన్నారు. అర్హత లేని వ్యక్తుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పంపిణీ చేయిస్తూ.. వైకాపాకు కార్యకర్తగా పనిచేస్తున్న అధికారులపై ఎస్ఈసీ, కలెక్టర్కు వీడియో ఆధారాలు జత చేస్తూ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తెదేపా ఒక్కటే కృషి చేస్తుందని ఆ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కుమార రాజారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: అమరావతి మహిళలపై దాడి దారుణం: చంద్రబాబు