చిత్తూరు జిల్లాలోని తిరుపతి అర్బన్ పరిధిలోని రుయా కొవిడ్ ఆస్పత్రిలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు పోలీసులు పటిష్ట చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో ఎస్పీ వెంకట అప్పల నాయుడు నేతృత్వంలో బలగాలు రుయాలో గట్టి భద్రతను ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితులను అదుపులో ఉంచడమే ప్రథమ ప్రాధాన్యంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
భిన్న ప్రసారాలతో గందరగోళం..
ఓ వైపు ప్రాణ వాయువు సరఫరాలో నాణ్యత లోపించడం కారణంగా రుయాలో జరిగిన మహా విషాదంలో పదకొండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటనా సమయంలో ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేసిన వివరాలు భిన్నంగా ఉండటంతో రోగుల కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. కొవిడ్ ఆస్పత్రి కావటంతో లోపలకు వెళ్లలేని పరిస్థితులు. కొంత మంది ధైర్యం చేసి లోపలకి వెళ్లి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న తిరుపతి అర్బన్ పోలీసులు రుయాను తమ అధీనంలోకి తీసుకున్నారు.
ట్యాంకర్ ఆలస్యంపై పూర్తిస్థాయి దర్యాప్తు..
మృతుల వివరాలను వైద్యాధికారులు సేకరిస్తున్నారని.. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామన్నారు. పదకొండు మినహా మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉందన్న ఎస్పీ.. 30 మందితో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడులోని శ్రీ పెరంబూరు నుంచి రుయాకు రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యానికి గల కారణాలేమిటన్న అంశాలపైనా లోతైన దర్యాప్తు చేస్తామన్నారు.
తప్పుడు వార్తలపై కొరడా..
సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు వార్తలతో రోగుల బంధువులను భయభ్రాంతులకు గురిచేయవద్దని కోరారు. వైద్యుల అనుమతి మేరకు.. దేహాలను కుటుంబీకులకు అందించే విషయంపై చర్చిస్తామన్న ఎస్పీ.. శాంతి భద్రతల విషయంలో తప్పు చెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : 'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం