తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల భవనానికి అనుబంధంగా మరో భవన నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. సుమారు రూ.25 కోట్లతో జీ ప్లస్ 5 భవనాన్ని నిర్మించడానికి హైదరాబాద్‌కు చెందిన యారో కన్‌స్ట్రక్షన్ సంస్థ శ్రీకారం చుట్టింది. మూడేళ్లలో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్తును నిర్మించి స్విమ్స్ యూనివర్సిటీకి అప్పగించారు. వైద్య కళాశాల భవనానికి.. నిర్మించిన భవనాన్ని అనుసంధానించారు. అప్పటి నుంచి శ్రీపద్మావతి వైద్య కళాశాల ఆస్పత్రిగా సేవలందిస్తోంది. భవనంపైన మరో మూడు ఫ్లోర్ల నిర్మాణం సాగిస్తున్న క్రమంలో.. ప్రభుత్వం మారడంతో నిధులు ఆగిపోయాయి. పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రిగా ప్రకటించడంతో అక్కడ రిసెప్షన్ కౌంటర్, ఐసీయూ కొవిడ్ వార్డు నిర్వహిస్తున్నారు. వైద్యుల ఛాంబర్ కూడా అక్కడే ఉంది.
లోపభూయిష్టంగా నిర్మాణం
భవన నిర్మాణం లోపభూయిష్టంగా సాగిందనే ఆరోపణలు వచ్చాయి.. మొదటి నుంచి కొద్దిపాటి వర్షానికే భవనం కురుస్తోంది. సిమెంటు రాళ్లు అతికించిన చందాన నిర్మాణం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఆదివారం కిటికీల సన్‌సైడ్ విరిగి పడింది. అక్కడి నిర్మాణం మధ్య చిన్నపాటి ఇనుప కమ్మీ సైతం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చేపట్టిన నిర్మాణానికి సిమెంటు పూత వేయని కారణంగా.. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారులు భవన నిర్మాణ పటిష్ఠతను తేల్చడానికి ముగ్గురు ఎస్‌ఈలతో సోమవారం త్రిసభ్య కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఘటన జరిగినా రాని మార్పు
సోమవారం కూడా అదే భవనంలో ఐసీయూ కొనసాగింది. రిసెప్షన్ కౌంటర్ ప్రవేశ మార్గంలో విరిగిపడిన సన్‌సైడ్ పెళ్లలు అలాగే ఉన్నా.. అటువైపు మార్గంలో రాకపోకలు సాగించారు. కొవిడ్ బాధితులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది అదే మార్గంలో తిరిగారు. ఆ దారిలో కూడా కర్రల సాయంతో 3 కిటికీల సన్‌సైడ్లు ఉన్నాయి. అసంపూర్తి భవనంలో కొవిడ్ బాధితులకు భద్రత ఎలా ఉంటుందని విపక్ష నేతలు ఆరోపించారు. కొవిడ్ ఆస్పత్రి స్విమ్స్‌లో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. స్విమ్స్ ఉద్యోగులు, అధికారులతో ఘటనపై ఆరా తీశారు.
ఇవీ చదవండి: