గాండ్రించే పులులు...గర్జించే సింహాలు... ఘీంకరించే ఏనుగులు...అన్నీ సందర్శకులకు దూరమై 6నెలలు గడుస్తోంది. మూగజీవాలు ఆకలి చూపులు చూస్తున్నాయి. కిలకిలరావాలు చేస్తూ పండ్లు, గింజలు తినే చిన్నిగువ్వల నుంచి అధిక ఆహారం తీసుకొనే క్రూరమృగాల వరకూ అన్నింటికీ పోషణ కరవైంది. విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద జంతుప్రదర్శనశాలగా పేరొందిన తిరుపతి ఎస్వీ జూపార్క్ కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ఆదాయాన్ని కోల్పోయి, ఉన్న నిధులనే సరిపెడుతున్న వేళ... ప్రజలు స్పందించి పెద్దమనసుతో ముందుకు రావాలని కోరుతూ జంతువులు, పక్షుల దత్తత విధానాన్ని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు.
కరోనా ముందు వరకూ సగటున రోజుకు 2వేల నుంచి 3వేల వరకూ సందర్శకులు ఎస్వీ జూ పార్కుకు వచ్చేవారు. టిక్కెట్ల విక్రయం ద్వారానే ఏడాదికి 6కోట్ల ఆదాయం వచ్చేది. కరోనాతో 6 నెలలుగా జూపార్క్ మూతపడింది. నిర్వహణకు నిధులు అరకొరగా వస్తుండగా.. ఉన్న ఒక్క ఆదాయ మార్గం మూసుకుపోయింది. జంతు ప్రదర్శనశాల నిర్వహణ భారంగా మారింది. అందుకే ప్రజల నుంచి విరాళాలు ఆహ్వానిస్తూ దత్తత పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్వీ జూపార్క్‌లో తెల్లపులులు, జాగ్వార్ వంటి 86 రకాల విభిన్న జాతుల జంతువులు, స్వదేశీ, విదేశీ పక్షులు ఉండగా...మొత్తం 1147 మూగజీవాలు ఉన్నాయి. వీటిని దత్తత తీసుకోవాలనుకునే వారు....ఇచ్చే విరాళాలను అనుసరించి లెవల్ -1 నుంచి లెవల్-8 వరకూ అధికారులు విభజించారు. రోజుకు 20 రూపాయల నుంచి సంవత్సరానికి 35లక్షల రూపాయల వరకూ ఆయా జంతువులు, పక్షులను అనుసరించి వాటి ఖర్చులు ఇలా ఉంటాయి.
జంతువు రోజు ఖర్చు నెల ఖర్చు ఏడాది ఖర్చు
తాబేలు రూ.14-20 రూ.420-570 రూ.5,110-6,935
బ్లాక్ స్వాన్ రూ.28 రూ.840 రూ.10,220
కొండచిలువ రూ.48 రూ.1,440 రూ.17,520
తెల్లపులి/సింహం రూ.1,327 రూ.39,810 రూ.4,84,355
ఏనుగు రూ.5,180 రూ.1,55,400 రూ.18,90,700
జంతువులు, పక్షులను దత్తత తీసుకునే వారు అందించే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు పత్రం అందిస్తున్న అధికారులు...వారు దత్తత తీసుకున్న జంతువు లేదా పక్షి వద్ద కోరిన పేరు, చిరునామా రాసి బోర్డును ఉంచేలా ప్రణాళికలు రచించారు. ఇచ్చిన విరాళాన్ని బట్టి తిరిగి జూ తెరుచుకున్న తర్వాత ఉచిత టిక్కెట్లను దాతలకు అందించటంతో పాటు వెబ్ సైట్లోనూ వారి పేరు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. తమకు తోచిన రీతిలో సాయమందించి జంతుప్రేమికులు తోడ్పాటునివ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఫోన్ చేయాల్సిన నెంబర్:- 9440810066
ఇదీచదవండి
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా: ఎంపీ కేశినాని